పాలకపార్టీలో నాయకత్వ సమస్య రావణకాష్టంలా రగులుతూనే వుంది. రోజులు గడుస్తున్న కొద్దీ జగన్ అభిమానుల్లో అసహనం పెరిగిపోతోంది. ఇంకా ఎన్ని రోజులు ఈ జాగారం అని కొంతమంది యువనాయకులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అటో ఇటో తేల్చుకుందామని జగన్‌పై ఒత్తిడి చేస్తున్నారు. పైకి చెప్పకపోయినా జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తహతహలాడిపోతున్న కొంతమంది ఎమ్యెల్యేలు, మంత్రులు కూడా ఇదే స్థాయిలో రియాక్ట్ అవడానికి సిద్దంగా వున్నారు. జగన్ ఊ అంటే రెచ్చిపోవడానికి జనం కూడా రెడీ అవుతున్నారు. అయితే తగిన మహూర్తమే కుదరడంలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అడ్డం వస్తూనే వుంది. వైఎస్ మరణించిన తొలి రోజుల్లో తొందరెందుకు, భావోద్వాగాలు తగ్గనివ్వండి.......తాపీగా ఆలోచిద్దాం అని అధిష్టానం సర్దిచెప్పడంతో అందరూ ఆగిపోయారు. ఆ తరవాత కొద్దిరోజులకు అంతా సద్దుమణింది కాబట్టి ఇక రేపో మాపో నిర్ణయిస్తారనుకుంటున్న తరుణంలో మెరుపు వరదలు పలు జిల్లాలను ముంచెత్తాయి. రాష్ట్రమంతా విషాదంలో మునిగివున్న సమయంలో నాయకత్వం కోసం కారట్లాడితే బాగుండదని జగన్ మద్దతుదారులు మిన్నకుండిపోయారు. జగన్‌తో సహా అందరూ వీలైనంత మటుకు వరదసహాయ కార్యక్రమాల్లో మునిగిపోయారు. మరోవైపు అధిష్టానం కూడా మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా వుంది. ఈ ఎన్నికలు పూర్తయిన తరవాతే జగన్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం వుందని ఇప్పటివరకు అందరూ చెబుతున్న మాట. మరి ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. వరదలు వెళ్ళిపోయాయి. ఏ క్షణంలోనైనా జగన్‌కు ఢిల్లీనుంచి పిలుపు వస్తుందనుకుంటుంటే పండగ సెలవులు అడ్డం వస్తున్నాయి. దీపావళి శనివారం నాడు రావడంతో ఆదివారం కూడా కలిసి రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో ఈ రెండు రోజులూ అందరికీ విశ్రాంతే.
గత నాలుగురోజులుగా హైదరాబాదులో వున్న జగన్ ఈ రోజు (16.10.2009) కుటుంబసభ్యులతో కలిసి బెంగుళూరు వెళ్ళారు. ఈ రెండు రోజులూ అక్కడే వుంటారు. కెవిపి కూడా సాగునీటి జలాల నిర్వహణపై మొయిలీ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉదయమే ఢిల్లీ వెళ్ళారు. ఇద్దరు ముఖ్యనేతలు లేకపోవడంతో మద్దతుదారులు కూడా సెలవు తీసుకున్నట్టున్నారు క్యాంపు కార్యాలయంలో సందడే లేదు. సోమవారంనాడు జగన్ తిరిగి వచ్చిన తరువాతగాని మళ్ళీ హడావుడి మొదలు కాదు. ఇలా అందరూ దీపావళికి సెలవులను సరదాగా గడపడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జె.సి. దివాకర్‌రెడ్డి మాత్రం భవిష్యత్తుకు నిచ్చెనలు వేసుకుంటూ బిజీగా వున్నారు. వైఎస్ మరణానంతరం చాలారోజులు పాటు అంటీ ముట్టనట్టు వ్యవహరించిన జెసి ఇప్పుడు రోశయ్యను గట్టెంచే బాధ్యత తనదేనన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జగన్ మద్దతుదారులను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వున్నారు. ఆయన సారధ్యంలో మంత్రిమండలి కూడా వుంది. పరిపాలన సక్రమంగా సాగుతోంది అని తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా బాగా పనిచేస్తోందని వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. అందరూ కోరుతున్నట్టుగా సిఎల్‌పి సమావేశం వెంటనే పెట్టాల్సిన అవసరంలేదని, ఎప్పుడో అసెంబ్లీ సమావేశాల ముందు ఆనవాయితీగా నిర్వహిస్తే సరిపోతుందని అంటున్నారు. అంతేకాదు ఒకప్పుడు వైఎస్‌ను వ్యతిరేకించిన వారినందరిని పోగు చేసి సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు.
బుధవారం నాడు ఆయన ఇంట్లో పలువురు సీనియర్లు సమావేశమై దాదాపు రెండు గంటల పాటు చర్చించుకున్నారు. దివాకర్‌రెడ్డితో పాటు పాల్వాయి గోవర్థనరెడ్డి, కె.ఆర్.ఆమోస్, పి.నర్సారెడ్డి, పి. ఇంద్రసేనారెడ్డి, యాదవరెడ్డి, డి.కె.సమరసింహారెడ్డి, కమలాకర్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే గురువారంనాడు పిసిసి ఛీఫ్ డి. శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు ప్రయత్నిస్తున్న డి.కె. సమరసింహా రెడ్డిని కూడా తనతో పాటు తీసుకెళ్ళి ధరఖాస్తు చేయించారు. ఇద్దరూ కలిసి గంటకు పైగా డిఎస్‌తో చర్చించారు. సమరసింహారెడ్డిని పంపించేసి జెసి, డిఎస్ లు మరో అరగంటపాటు విడిగా మంతనాలు జరిపారు.
ఎవరిని మెప్పించడానికి లేక ఎవరిని వ్యతిరేకించడానికి జె.సి గత కొద్ది రోజులుగా ఇంత హడావుడి చేస్తున్నారు ? ఇదంతా అధిష్టానంపై భక్తిప్రపత్తులేనా ? లేక అంతర్లీనంగా మరింకేదైనా ఆశ వుందా ? అని ఎవరినడిగినా " ఇందులో పెద్దగా చెప్పడానికేముంది. జగన్ శిబిరంలో ఎలాగూ స్థానం లేదు. కనీసం రోశయ్యకైనా మద్దతు ఇస్తే తనకు మళ్లీ మంత్రిపదవి దక్కుతుందని ఆశిస్తున్నాడేమో.' అని సమాధానం వస్తుంది. కాని జెసి వ్యవహారశైలి తెలిసిన వారు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడంలేదు. కేవలం మంత్రిపదవికోసమే అయితే ఇంత హైరానా పడాల్సిన అవససరం లేదు. కొండకు వెంట్రుక వేసి లాగే నైజంగల జెసి ఇంకా ఏదో పెద్ద పదవికోసమే టెండరు పెట్టి వుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రిపదవి కంటే పెద్ద పదవి ఇంకేముంటుంది. ముఖ్యమంత్రి పదవిలో రోశయ్య ఇప్పటికే వున్నారు. ఆ సీటుకు ప్రధాన పోటీదారుడుగా జగన్ కూడా వున్నారు. మహా అయితే హోం లాంటి ఏదైనా కీలక శాఖ ఆశిస్తూ వుండి వచ్చని మీరు భావిస్తే పప్పులో కాలేసినట్టే. కాంగ్రెస్ పార్టీలో ఈ రెంటికన్నా పవర్‌ఫుల్ పోస్టులు ఇంకా కొన్ని వున్నాయి. అవే అధిష్టానం కనుసన్నల్లో నడిచే పవర్‌సెంటర్లు, వాటి సారధులు. అన్ని రాష్ట్రాల్లో పార్టీని పూర్తిగా తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం పాటించే ప్రధాన సూత్రం విభజించి పాలించడం. దీని కోసం సంఖ్యాబలాన్ని బట్టి నలుగురైదుగురు సీనియర్లు లేదా ఔత్సాహికులను గుర్తించి వారి సారద్యంలో పవర్‌సెంటర్లను ప్రోత్సహించడం, వారికి అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడం మామూలే. అలాగే ఈ గ్రూపుల మధ్య తంపులు పెట్టి తన పబ్బం గడుపుకోవడం కూడా మామూలే. అధిష్టానం డైరక్ట్ కంట్రోల్‌లో నడిచే ఈ గ్రూపుల సారధులకుండే అపరిమిత పలుకుబడి ముందు ఎటువంటి మంత్రిపదవైనా దిగదుడుపే. బలమైన గ్రూపుకు నాయకత్వం వహించేవారికి అదృష్టం కలిసొస్తే ముఖ్యమంత్రి పదవులు కూడా దక్కిన సందర్భాలు గతంలో ఎన్నో వున్నాయి. ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా అధిష్టానం దగ్గర వున్న అపార పలుకుబడితో వీరు చేసే పెత్తనం అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రితో సహా ఎవరైనా వీరి ముందు మోకరిల్లవలసిందే. లేదంటే అధిష్టానానికి ఉన్నవీ లేనివీ చెప్పి ఎక్కడా ఊష్టింగు ఇప్పిస్తారోనని భయం. వారు కోరుకుంటే రాష్ట్రంలోనైనా, కేంద్రంలోనైనా జరగని పని అంటూ వుండదు.
ఇటువంటి ఓ పవర్‌సెంటర్‌కు సారధ్యం వహించడానికే జెసి ప్రయత్నమంతా. అందుకు అవసరమైన మందీ మార్బలాన్ని సమకూర్చుకోవడానికి, అధిష్టానం దృష్టిలో పడటానికే ఆయన ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కనీసం నాలుగైదు పవర్‌సెంటర్లు ఏర్పడే సూచనలు స్పష్టంగా వున్నాయి. జగన్ మద్దతుదారులు ఇప్పటికే ఓ గ్రూపుగా పరిగణించబడుతున్నారు. ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా రోశయ్య ఓ గ్రూపుకు నాయకత్వం వహిస్తున్నట్టే లెక్క. ఇక పోతే ఢిల్లీలో ఎంపిలు బేస్‌గా ఒక గ్రూపు, తెలంగాణా నాయకులతో ఒక గ్రూపు, రోశయ్యకు సమాంతరంగా ఓ గ్రూపు ఏర్పడటానికి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఇవి గాక చిన్నా చితకా గ్రూపులు ఎలాగూ వున్నాయి. ఇందులో రోశయ్యకు సమాంతరంగా అధిష్టానం కనుసన్నల్లో నడిచే గ్రూపు నాయకత్వం కోసమే ఇప్పుడు జెసి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. దాని కోసం జెసి కన్నా సీనియర్లు వున్నప్పటికి వయస్సురీత్యా వారికున్న పరిమితులు దృష్య్టా వారి మద్దతు కూడగట్టుకోవడానికి జెసి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు వైఎస్ వ్యతిరేక వర్గంలోని చాలామంది సహకరిస్తున్నారన్న విషయం సుస్పష్టం. మరి ఈ ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సఫలీకృతులౌతారో చూడాలి. ఒకవేళ కాకపోయినా నష్టం కూడా ఏమీ లేదు. కొండ రాకపోయినా వెంట్రుకైనా(మంత్రిపదవి) మిగులుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment