రాష్ట్రంలో ప్రస్తుతం పర్యటనల జాతర జరుగుతోంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో లక్ష్యం. ఆపన్న హస్తం అందించాలన్న అమృత హృదయం కొందరిదైతే అందినకాడికి దోచుకుందామన్న కర్కశత్వం మరికొందరిది. ఏదో ఒక సహాయం చేయాలన్న చిత్తశుధ్ధి కొందరిదైతే, రాజకీయ లబ్ది పొందుదామన్న పిదప బుద్ధి మరికొందరిది. ప్రమాదం నుంచి జనాన్ని కాపాడదామన్న లక్ష్యం కొందరిదైతే ఉచితంగా ప్రచారం లభిస్తుందన్న ఆశ మరికొందరిది. పదవి అప్పగించిన బాధ్యత కొందరిదైతే భవిష్యత్తులో పదవుల కోసం పోరాటంలో పనికి వస్తుందన్న ముందుచూపు మరికొందరిది. ఇలా మొత్తం మీద ఏదో ఒక లక్ష్యంతో అందరూ వరద తాకిడికి గురైన జిల్లాలపై పడ్డారు. జనం అడిగినా అడగకపోయినా తమ వెంట తీసుకువెళ్ళిన సామాగ్రిని పిలిచి మరీ పంచి పెడుతున్నారు. అర్థం అయినా కాకపోయినా బాధితులు చెప్పింది శ్రధ్దగా వింటున్నారు. చేసినా చేయకపోయినా అరచేతిలో స్వర్గం చూపించేస్తున్నారు. ఇలా వచ్చే పోయేవారిలో పెద్దపెద్దవారు, సినీ గ్లామర్ వున్నవారు కూడా వుండటంతో అధికారులకు వారిని రిసీవ్ చేసుకోవడానికి, సెండాఫ్ చెప్పడానికే సరిపోతోంది. వీరి తాకిడి వరద తీవ్రతను మించిపోవడంతో చాలా ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలకు అవరోధం కూడా ఏర్పడుతోంది. ఇక దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా నలుగురు కలిసే ప్రతిచోటా వసూళ్ళ పర్వం నడుస్తోంది. వరద బాధితుల సహాయార్థం అంటూ ఎవరుబడితే వారు, ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు. కొంతమంది నగదు రూపంలో వసూళ్ళు చేస్తుంటే మరికొందరు చెక్కులు, డిడిలను సిఎం రిలీఫ్ ఫండ్ పేరుతో కాకుండా తమ సొంత పేరుతో తీసుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి చేరతాయో లేదో, విరాళాలు సేకరించేవారిలో అసలు ఎవరో నకిలీ ఎవరో తెలియక విరాళం ఇచ్చిన వారు ఓ నిట్టూర్పు వదిలి దేవుడిపై భారం వేస్తున్నారు. అయితే కొన్ని సంస్థలు ఇస్తున్న భూరీ విరాళాలు, ఉద్యోగులు సామూహికంగా చేస్తున్న భారీ విరాళాలు దారి తప్పకుండా నేరుగా సిఎం రిలీఫ్ ఫండ్‌కు జమ అవడం కొంత ఊరట కలిగించే విషయం. ఈ విషయంలో దాతలకు టివి 5 అండగా నిలబడటం ముదావహం.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ నిన్న రాష్ట్రంలో వరద తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించారు. ఆలస్యంగా వచ్చినా వరద బాధితుల పట్ల ఎంతో ఉదారంగా స్పందించారు. వెయ్యికోట్ల తక్షణ సహాయాన్ని ప్రకటించారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశంలోనే వరద బాధితులకు కేంద్రం ఇంత భారీ స్థాయిలో సహాయాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. అది కూడా తక్షణ సహాయంగా. అంటే కేంద్రబృందాల పర్యటన తదితరాలు పూర్తయిన తరవాత మరికొంత వచ్చే అవకాశం వుంది. వాస్తవానికి మన రాష్ట్రం అడుగుతున్న దానితో పోల్చుకుంటే ఇది తక్కువే అయినప్పటికి వెయ్యి కోట్లు ఒకేసారి ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో గుజరాత్, బీహార్, అస్సాం, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల్లో వరద వచ్చినప్పుడు కూడా కేంద్రం ఇంత భారీ స్థాయిలో సహాయాన్ని ప్రకటించలేదు. మన రాష్ట్రంలో కూడా గత పదేళ్ళలో వచ్చిన ఏ వరదల్లోనూ ఈ స్థాయిలో స్పందించలేదు. ఈ వెయ్యి కోట్లు రాష్ట్రం ఖాతాలోకి ఎప్పుడు వస్తాయి ? వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేస్తుంది అన్న విషయాలను పక్కన పెడితే కేంద్రం ఎన్నడూ లేనంతగా మన రాష్ట్రానికి ఇంత భారీ మొత్తంలో సహాయం ఎందుకు ప్రకటించింది ? వరద బాధితులపై ప్రేమా అంటే వరదలకు వెంటనే స్పందించడంలో జరిగిన ఆలస్యం, సోనియా పర్యటనలో కనపరిచిన నిర్లిప్తిత చూస్తుంటే అలా అనిపించడం లేదు. పోని బాధితుల కన్నీటికి ప్రధాని కరిగిపోయారా అంటే ఏరియల్ సర్వేలో మునిగిపోయిన పొలాలు, గ్రామాలే గాని ప్రజల కన్నీరు కనపడే అవకాశం లేదు. వరద నీరు మొత్తం వెనక్కి తీసేసిన తరవాత వచ్చారు కాబట్టి వరద తీవ్రత అర్థమయ్యే పరిస్థితి అసలు లేదు. మరి ఏమి చూసి ఇంతగా స్పందించారు అంటే తాము ఏరి కోరి నియమించిన ముఖ్యమంత్రి శ్రీ రోశయ్యకు బూస్ట్ ఇవ్వడానికే అని సమాధానం లభిస్తుంది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరవాత శ్రీ రోశయ్య ఎదుర్కొన్న తొలి పరీక్ష ఈ వరదలు. దీన్ని ఎదుర్కొవడానికి ఆయన శాయశక్తులా కృషి చేసినప్పటికి అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ప్రధానంగా అధికారుల మధ్య సమన్వయ లోపం, ముప్పు నివారణపై స్పందించడంలో జాప్యం, పునరావాస సహాయ కార్యక్రమాల్లో కొరవడిన వేగం వంటి లోపాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపాయి. వరద ప్రాంతాల్లో పర్యటనకు రోశయ్య వెనకాముందూ ఆడుతుంటే తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు, పిఆర్‌పి నేత చిరంజీవి, ఇతర ప్రతిపక్ష నేతలు వరదప్రాంతాల్లోకి దూసుకెళ్లి బాధితులను పరామర్శించారు. ఎక్కడ చూసినా చంద్రబాబు, చిరంజీవిలే కనిపించారు. అనేక ప్రాంతాల్లో స్వయంగా వుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. వరద తీవ్రస్థాయిలో వున్న రోజున చంద్రబాబు స్వయంగా ఆయా జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి పరిస్థితిని కనుక్కుంటూ సూచనలు కూడా చేశారట. మంత్రులు కూడా వీరికి ధీటుగా రాత్రింబవళ్ళు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్లోన్నప్పటికి ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కే పరిమితం కావడం, అంతా ఫోన్లమీదే నడిపించాలని ప్రయత్నించడం పలు విమర్శలకు దారి తీసింది. అధికారులకు ఇబ్బందులు కలగకుండా వుండటానికే తాను పర్యటనలకు వెళ్ళలేదని రోశయ్య వివరణ ఇచ్చినప్పటికి ఫలితం లేకుండా పోయింది. వరద వున్న రోజునే కాదు, పునరావాస కార్యక్రమాలు జరుగుతున్న ఈ రోజున కూడా చంద్రబాబు, చిరంజీవి వరద జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి విమానాల్లో, హెలికాప్టర్లలో తిరుగుతూ వుంటే వీరు వరద తాకిడి ప్రాంతాల్లో కాలినడకన గల్లీ గల్లీలో తిరుగుతూ బాధితులను ఆదుకుంటున్నారు. తమ పార్టీ కార్యకర్తలను భారీ స్థాయిలో రంగంలోకి దింపి సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలు కూడా సముచితంగానే స్పందించాయి. మరోవైపు జగన్ కూడా తన రాజకీయాలను తాత్కాలికంగా పక్కన పెట్టి పడవల్లో తిరుగుతూ బాధితులను ఆదుకున్నారు. వరద భాదితులకు భూరీ సహాయం ప్రకటించారు. పునరావాస సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్లొన్నారు.
వరదలు ఉధృతంగా వున్నప్పుడు గాని, ఆ తరవాత పునరావాస, సహాయ కార్యక్రమాల్లో గాని జనం మధ్య కనిపించని ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య. దీనికి తగ్గట్టుగా సోనియా గాంధీ హడావుడిగా పర్యటించి వెళ్ళిపోవడం, కేంద్రం వెంటనే స్పందించకపోవడం వంటి ఘటనలు రోశయ్య ఇమేజ్‌పై బాగా ప్రభావం చూపాయి. ఆయనకు అనుభవం వున్నా ప్రతిపక్షాలతో పోటీ పడి పరిగెత్తగల సత్తా లేదన్న విమర్శలు వినవచ్చాయి. కర్నూలు జిల్లాకు చెందిన సొంత పార్టీవారే రోశయ్య పెద్ద వేస్ట్ అని పత్రికాముఖంగా వాఖ్యానించారు. ఇదంతా గమనిస్తున్న అధిష్టానానికి తాము ఏరి కోరి నియమించిన రోశయ్యను ఎలాగైనా గట్టెక్కించాల్సిన పరిస్థితి తలఎత్తింది. ఈ పరిస్థితిలో వైఎస్ లేదా జగన్ వుండివుంటే ఇలా వుండేది కాదని పలుచోట్ల ప్రజలు చేసిన వ్యాఖ్యలతో పుండుమీద కారం చల్లినట్లయింది. అందుకే ఆరు రోజులు ఆలోచించి దేశమంతా ఔరా అనే విధంగా ఒక్కసారే వెయ్యికోట్లు తక్షణ సహాయంగా ప్రకటించింది. ఇంత భారీగా కేంద్రంనుంచి సహాయం సాధించుకొచ్చిన ఘనత రోశయ్యకు దక్కే విధంగా ప్రధానిని పంపించి ఆర్భాటంగా ప్రకటన చేయించింది. ప్రకటనైతే ఆర్భాటంగానే చేశారు. ఎప్పుడిస్తారో ఏమిటో !! కదలకుండా కూర్చుంటే లాభంలేదని రోశయ్యకు కూడా క్లాసు తీసుకున్నట్టున్నారు ఆయన కూడా రేపటినుంచి (11.10.2009) వరద పీడిత జిల్లాల్లో పర్యటనకు బయలుదేరుతున్నారు. కేంద్రం ఇచ్చిన ఈ బొటాక్స్ ఇంజక్షన్ రోశయ్యకు కావలసిన బూస్ట్ ఇస్తుందని ఆశిద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment